12 రోజులు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు జరిగిందో తెలుసా?

  • 2010లో చైనాలో 100 కి.మీ మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌
  • నేషనల్ హైవే-110పై 12 రోజుల పాటు నిలిచిన వాహనాలు
  • ట్రక్కుల రద్దీ, రోడ్డు మరమ్మతులే ప్రధాన కారణం
  • ట్రాఫిక్‌ జామ్‌ ప్రాంతంలో వెలిసిన తాత్కాలిక దుకాణాలు
హైదరాబాద్‌లో వర్షం మొదలైతే చాలు.. రోడ్లన్నీ పార్కింగ్ స్థలాల్లా మారిపోతాయి. బెంగళూరులో అయితే ట్రాఫిక్‌లో చిక్కుకోవడం రోజువారీ జీవితంలో భాగమే. అరగంట, గంట ట్రాఫిక్‌లో నిలిచిపోతేనే చిరాకు, అసహనం తారస్థాయికి చేరుకుంటాయి. అలాంటిది ఒకసారి వాహనం స్టార్ట్ చేసి రోడ్డెక్కిన తర్వాత ఏకంగా 12 రోజుల పాటు ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోతే? కారు, ట్రక్కుల్లోనే తిని, పడుకొని, రోజులు గడపాల్సి వస్తే? వినడానికి సినిమా కథలా అనిపించినా.. 2010లో చైనాలో నిజంగానే ఇలాంటి ఘటన జరిగింది.

చైనాలోని ఇన్నర్‌ మంగోలియాను బీజింగ్‌తో కలిపే నేషనల్‌ హైవే-110పై ఈ భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దాదాపు 100 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా బొగ్గు, నిర్మాణ సామగ్రిని తరలించే ట్రక్కుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం, మరోవైపు రోడ్డు మరమ్మతు పనులు కొనసాగడం వల్ల హైవేపై వాహనాల సంఖ్‌య పెరిగింది. అప్పటికే ఆ మార్గంలో ట్రాఫిక్‌ ప్రతి ఏడాది సుమారు 40 శాతం చొప్పున పెరుగుతుండటంతో పరిస్థితి మరింత దిగజారింది.

మొదట్లో వాహనదారులు ఆగ్రహంతో హారన్లు మోగిస్తూ, అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అయితే గంటలు రోజులు కావడంతో పరిస్థితిని అంగీకరించక తప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు రోజుకు కేవలం ఒక కిలోమీటర్‌ మాత్రమే ముందుకు కదిలాయని నివేదికలు చెబుతున్నాయి. కొందరు డ్రైవర్లు ట్రాఫిక్‌ నుంచి బయటపడటానికి దాదాపు 12 రోజులు పట్టింది. ట్రాఫిక్‌ జామ్‌ కొనసాగుతుండటంతో స్థానిక గ్రామస్తులు దీనిని వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు. హైవే పక్కనే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి నీరు, నూడుల్స్‌, సిగరెట్లు, స్నాక్స్‌ విక్రయించడం ప్రారంభించారు. సాధారణంగా 1 యువాన్‌ ధర ఉండే వాటర్‌ బాటిల్‌ను 15 యువాన్‌ల వరకు విక్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

దీంతో హైవే ఒక తాత్కాలిక పట్టణంలా మారిపోయింది. వాహనాల్లోనే నిద్రపోవడం, ట్రక్కుల మధ్య నడుచుకుంటూ తిరగడం, ఆహారం కోసం వరుసల్లో నిలబడటం వంటి దృశ్యాలు కనిపించాయి. చివరకు ట్రక్కుల రాకపోకలపై ప్రత్యేక నియంత్రణలు అమలు చేయడంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.

China Traffic Jam
National Highway 110
Beijing
Inner Mongolia
2010 Traffic Jam
Longest Traffic Jam

More Telugu News